Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

18, మే 2012, శుక్రవారం

సత్యం - శివం - సుందరం

                                     (పింగళి మోహిని)

సీ.    వెలియైన విలువైన వేదాది విద్యల      |   మనకంద జేసిన మత్స్యరూపి
        అమరత్వలబ్ధికి నాధారభూతమై        |   కూర్మి వెన్నందించు కూర్మరూపి  
        అసుర గుణావిష్టయైనట్టి పుడమిని     |   రక్షించు నాదివరాహమూర్తి
        దుష్టశిక్షణ కేళి శిష్టరక్షణ కళా             |   శీలతత్పరుడు నృసింహమూర్తి
        దివ్యకార్యార్థమై త్రిపదాల బలిమితో      |   బ్రహ్మాండమలమిన వామనుండు
        పరశువు జేబూని ప్రబలక్షత్రియ గర్వ  |  భంగమ్ము గావించు భార్గవుండు
        ఆశ్రితావనదీక్ష యాదర్శవర్తనల్          |  ధర్మవిగ్రహుడు కోదండపాణి
        అఖిల నిగమ సారమగు గీత బొధించు | ఆచార్యవరుడైన యదువిభుండు

తే.గీ.    ధర్మహితబొధ చేయు సిద్దార్థమౌని
           లీలనవతార కళలన్ని మేళవించి
          ధర్మసంస్థాపనార్థమై ధరకు దిగిన
           పదవయవతారుడే! సాయి ప్రభువరుండు! ...1

సీ.    మానవ సేవల మహిమంబు జాటిన  | పుణ్యుండు గౌతమ బుద్ధుడతడు!
        ఆశ్రితావనదీక్ష యాసురగుణ శిక్ష     | జరిపించు శ్రీరామ చంద్రుడితడు!
        మనుజ కర్తవ్యమ్ము మరుగునబడు వేళ | కేల్సాచి బోధించు కృష్ణుడితడు!
        స్వార్థమ్ము త్యజియించి పాపుల క్షమియించు  | కీర్తిని గాంచిన క్రీస్తు యితడు!

తే.గీ.     సర్వధర్మాల సారమీ సత్యసాయి!
             సకల మార్గాల గమ్యమీ సత్యసాయి!
             సర్వదేవతా రూపమీ సత్యసాయి!
             సకల జనవంద్యుడగు స్వామి సత్యసాయి! ...2

సీ.    అజ్ఞాన తిమిరమ్ము హరియించి కిరణాల  | వెలిగించు వెల్గుల వేల్పు యితడు!
        పరమత సహనంబు ప్రజల సంక్షేమమ్ము | లోకాన జాటు యశోకుడితడు
        శిష్యులప్రేమమ్ము స్థిరముగా పొందిన  |  గురుమూర్తి శ్రీరామకృష్ణుడితడు!
        భారత సంస్కృతీ ప్రాభవమ్మును |  విశ్వవేదిపై చాటు వివేకుడితడు!

తే.గీ.     సకల జనప్రేమ బోధించు శాంత్యహింస,
            సకల జనసేవ సాధించు సత్ప్రశంస
            సత్య శివ సుందరుండైన సత్యసాయి
            తెలుగు వెలుగైన ఘన విశ్వదీపకుండు! ... 3

సీ.     కన కన కమనీయ కనకాంబర ధరుండు |   విరిసిన చెంగల్వ విధము పదము!
        మల్లికా సౌరభ మహితంబు  మహిమంబు | తెల్లగులాబీల తేట మాట!
        అళికులముల బోలు తలనీలముల వాడు | చిరునవ్వు వెన్నలల్ చెలగు వాడు!
        సారస పద్మాల సరిబోలు వదనంబు |  కారుణ్య సంపద గనులు కనులు!

తే.గీ.     విశ్వభారతి మెడలోన విరులదండ!
            ఆశ్రితులకెల్ల నిండైన అండదండ!
            భక్త మందారుడౌ సాయి ప్రభువరుండు!
           మనకు తోడుగ నిల్వగా మనవి జేతు! ...4

శా.     దీక్షాదక్షత, త్యాగశీలతల దేదీప్యప్రభామూర్తి; భ
          క్త క్షేమావన సత్యబోధనల సత్కారుణ్యమూర్త్యాత్మకున్
         సాక్షాద్వేద స్వరూపునిన్ మహిము; విశ్వాధార ప్రేమాస్పదున్
         సాక్షాత్కారము నీయ వేడెద ప్రభున్ సత్యాశ్రయున్ సాయినిన్! ...5

కం.     చల్లని సేవానిరతియు
          యుల్లము రంజిల్ల జేయు నుపదేశంబుల్
          ఎల్లలు తెలియని ప్రేమను
          ఎల్లప్పుడు పంచి పెట్టు! మీశ్వర! సాయా! ...6

ఉ.    ప్రేరణ ధర్మరక్షణము ప్రేమసుధామయ సత్యసాయిగా
       క్షీరపయోధి పావనుడు శ్రీహరి దివ్యకృపావతారుడై
       కూరిమి తెల్గు దేశమున కోరికదీరగ పుట్టపర్తిలో
       కారణ జన్ముడై వెలయ కాంతి రహించెను భారతాంబకున్!  ...7

శా.    ఖండాంతర్గత భక్తసేవ్యునిగ ప్రఖ్యాతుండు నై; భారతీ
        భాండాగారమునుండి వెల్వడిన దివ్యగ్రంథ దీప్తిప్రభల్
        నిండారన్ వెలిగించె మానవుల సుస్నేహార్ద్రులై మెల్లగా;
        ఖండింపన్‍వలె మాదు సంకటములన్ కారుణ్య రత్నాకరా !   ...8

గీ.    శాస్త్రవేత్తలు వివిధ దేశాధిపతులు
        కవులు, జ్ఞానులు సత్కళాకార వరులు
        విశ్వమయుడవు నీవంచు విశ్వసించి       
        నిన్నె సేవించి తరియింత్రు | నిత్యవిధిని !   ...9

మ.    కదిలే దేవుని సత్యసాయి ప్రభువున్, కారుణ్య రత్నాకరున్
         పద పద్మంబులు గొల్చి, తన్మహిమ సంభావించి, భద్రాత్ములై,
         ముదమందన్, ప్రజలెల్ల చేరిరిట సమ్మోహాత్ములై నీయెడన్
        నదులన్నీ ప్రవహించి, సాగి తుద రత్నాగారమున్ జేరవే !  ... 10

గీ.    సృష్టి, ప్రతి సృష్టి నీయందె జూడ దగును
       శాంతి; యుపశాంతి నీతోనె సాధ్యపడును
       ధ్యాన జ్ఞానాలు నీయందు లీనమగును
       ద్వైత ప్రకృతి కావలనున్న దైవమీవు !  ... 11

సీ.     భాస్వంత కిరణాల భాస్కరుండైనను |   శశివోలె వెన్నెల చలువనిచ్చు
        సుందర సుకుమార సుమలీల హృదయంబు  | సంకల్పములు వజ్ర సన్నిభంబు
        కమలాల స్పూర్తిని కలిగించు హస్తాలు  |  చేతలద్భుతములు చేసిజూపు
       విశ్వమానవులకు విందులు చేయుచు |   పట్టెడన్నమె తాను పట్టితినును
        సర్వమానవులకు సంధించు శుభములు | భరియించు భక్తుల బాధలన్ని
       భక్తులు సాయిలో బరమాత్మ దర్శింప | ఆత్మను జూచుతా నఖిల జనుల
       అవతార వామనుండాకృతి గాంచగా, |   భువనమంతయువాని పుణ్యభూమి

ఆ.వె.    సర్వమతములందు సమతను దర్శించు
           విశ్వమందు దివ్యప్రేమ నింపు
           పుడమి జనులనెల్ల నొడిజేర్చి కాపాడు
           సత్యసాయి! విశ్వజనని కాదె !  ... 12
   
మ||       అదిగోనేతలు; శాస్త్రవేత్తలును సేవాసక్తులున్, భక్తులున్,
             విదితాత్ముల్, పరదేశవాసులును, నీ ప్రేమాబ్ధిలో గ్రుంకగా,
             ఇదిమా పర్వదినంబటంచు, వెసతో ఏతెంచి నారెందరో!
             సదయా! యీయెడ పుట్టపర్తియెక విశ్వగ్రామమే జూడగన్!   ...13

13, మే 2012, ఆదివారం

అమ్మ

(శశిధర్ పింగళి)

అవని యందున దైవము అమ్మయెకటె
అమ్మమించిన దైవమీ అవనిలేదు
తనకు తానుగ బ్రహ్మయే తరలి వచ్చి
అమ్మ రూపాన మనయింట నమరుకొనియె.

కడుపునిండుగ నినుమోసి కనిననాడు
తనదు స్తన్యంబు నందించి తనివిదీర
మురిసిపోవును కష్టంబు మరచిపోవు
తనదు సుఖములు మరచితా త్రాతయగును.

చిన్నిపూవుల చేతుల చేరదీసి
పొదివి కసుగాయలౌనట్లు పొదువుకొనెడు
తనదు బిడ్డల భవితకై తల్లడిల్లు
తరువు జూడగ తల్లియే తలపుకొచ్చు.

అమ్మ నీచేతి ముద్దయే కమ్మనౌను
అమ్మ నీప్రేమనాకెంతొ నాత్మబలము
అమ్మ నీనోటి మాటయే ఆశయమ్ము
అమ్మ నెరనమ్మి కొలిచెడి అంబనాకు.

నిదురలేచిన దాదిగా నిన్ను తలచి
నిలచియుండదు తానొక్క నిముసమైన
నిజము బిడ్డలయాకలి నెరుగు నామె
ఇలను పరికింప త్యాగాల నిలయమామె.

మాతృ సంసేవనాభాగ్యమబ్బినట్టి
సుతుల కిలలేదు కలిమికి శూన్యతెపుడు
సకల శుభముల నందించు శక్తియామె
సర్వ క్షేమంబు నరయునాసక్తియామె.

ఆడపుట్టుకలోననే అందముంది
ఆడపడుచటంచునుకొనియాడబడుచు
ముద్దుమురిపాల పెరుగుచు ముదితతాను
అమ్మచెంతనె నేర్చును అమ్మదనము.

ఆదివిష్ణువు తనుగూడ అమ్మకొరకు
పుడమిపడతుల గర్భాన పుట్టలేదె
అమ్మగోర్ముద్దలందలి కమ్మదనము
చాలు చాలంచు పల్కెడు చవట యెవడు.

బుడుతచేతులుపట్టుకు బుల్లిబుల్లి
మాటలనునేర్పు, నేర్పును మంచిమాట
నడకనేర్పును మురిపాన నడతనేర్పు
ఆదిగురువన అమ్మయే అవనిలోన.

ఆదిగురువైన అమ్మను ఆదరించి
పిదప పితరులు,గురువులు పేర్మిమీర
నేర్పు జీవితపాఠాల నెమరువేసి
ప్రీతి నడతుము విశ్వవిఖ్యాతినంద.

మాతృదినోత్సవ శుభాకాంక్షలతో...

6, మే 2012, ఆదివారం

ఆశామోహం( దీర్ఘ వచన కవిత )

(శశిధర్ పింగళి)

అప్పట్లో 80 ప్రాంతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ప్రతి పండుగలకు, జాతీయ దినాలకూ రేడియోలలో సాహిత్య కార్యక్రమాలు యేర్పాటుచేయడం పరిపాటిగా వుండేది.
ఆక్రమంలోనే ఒకసారి ఆగష్టు 15 స్వాతంత్ర్యదినాన్ని పురస్కరించుకొని ఒక సాహితీకార్యక్రమాన్ని బందరులో యేర్పటుచేసి దానిని రికార్డుచేసి ఆకాశవాణిలో ప్రసారం చేసారు. ఆ నాటి ఆ ప్రత్యక్ష కార్యక్రమంలో ప్రేక్షకుడిగా పాల్గొని యెందరో మహానుభావులను దర్శించుకొనే భాగ్యం అబ్బింది. వారిలో శ్రీ సి.నా.రె, ఆరుద్ర, ఇంద్రకంటి శ్రీకాంతశర్మ, ధారా రామనాధ శాస్త్రి, మొదలైన వారు పాల్గొన్నారు. సినిమా కవులుగా సి.నా.రె, ఆరుద్రల పట్ల ప్రత్యేక అభిమానం వుండేది. వీరంతా ఒక్కక్కరూ తమ తమ కవితలను చదువుతున్న క్రమంలో ఆరుద్ర గారు వచ్చి .. " వెళ్ళు... మళ్ళీరాకు.. " అంటూ మొదలుపెట్టి ఒక వచన కవితను చదివారు. అప్పటికి విద్యార్దిగానే వున్న నాకు, ఆరుద్ర నుంచి ఇంకా ఇంతకంటే గొప్పదేదో ఆశించిన నాకు కించిదాశాభంగమే అయింది. ఈపాటి కవితకోసమా ఆరుద్ర వచ్చిందనో లేక ఆరుద్ర లాంటి కవా ఈ కవిత వ్రాసారనో ఒక అసంతృప్తి యేర్పడింది. చాలా రోజులు వెంటాడింది. ఇదే కవిత్వమైతే ఆపాటి నేనూ వ్రాయగలనేమో ననిపించింది. వ్రాస్తే యేం వ్రాయాలి? అందుకే ఒక నేపధ్యాన్ని సృష్టించుకొని ప్రయత్నించానిలా. వ్రాసి మిత్రులకు చూపిస్తే బావుందనే ప్రశంసలు. కానీ నాకే తెలియని యేదో అసంతృప్తి. తర్వాతి చాలారోజులకి ఇదే నేపధ్యాన్ని మరోరూపంలో చూచుకుంటేకాని వూరట కలగలేదు.
అప్పటి ఈ నా మొదటి వచన కవితను మీకోసం వుంచుతున్నాను.. అభిప్రాయాలకోసం..